Tuesday, 8 April 2014

పవన్ కళ్యాణ్ కు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ..

డియర్ పవన్ కళ్యాణ్..

'ఇజం' పుస్తకం గురించి మాట్లాడే ముందు మొదటగా నేను పశ్చాత్తాప పడాలి. నువ్వు రాజకీయపార్టీ పెడతావన్నప్పట్నుంచీ నేను అమితోత్సాహంగా ఎదురుతెన్నులు చూశాను. నీ నిజాయితీని, సమగ్రతను ఎప్పుడూ పొగుడుతుండేవాడిని. జనసేన పార్టీ ఆవిర్భావం సమయంలో నువ్వు చేసిన ప్రసంగానికి నేనూ కూడా ముగ్దుడ్నైపోయాను.
ఇజం పుస్తకావిష్కరణ గురించి నేను విన్నప్పుడు నేను అమితానందపడ్డాను. నేను చిన్నప్పట్నుంచీ పుస్తకాలను విపరీతంగా చదివేవాడిని. ఇమ్మానుయేల్ కాంట్, ఆర్థర్ స్కాపెన్ హర్, డెస్కరేట్స్, విల్హె ల్మ్ హెగెల్, ఫెడ్రిక్ నిట్జాస్కె, బారక్ స్పినోజా, అయాన్ ర్యాండ్ వంటి వారి రచనల్ని నేను ఇంజనీరింగ్ విద్యార్థి దశలోనే చదివాను. ఆ తర్వాత ఆధునిక తత్వవేత్తలకు సంబంధించిన పుస్తకాలను కూడా చదివాను. తత్త్వశాస్త్రాన్ని సమాజానికి అన్వయించడం ద్వారా ఈ సమాజంలో వేగవంతమైన మార్పులొస్తాయని బోధించిన వారే వీరంతా కూడా. ఈ పాతతరం తత్వవేత్తల ఆలోచనా విధానానికి దూరంగా పురోగతితో కూడిన విధానమేదో నీ ఇజం లో ఉంటుందని నేను భావించాను.
అలా ఎందుకు భావించానంటే... సహజాతంగా వచ్చినటువంటి మేథో సంపత్తిని నేను నీలో చూశాను. ఆఖరికి నీ ఇజం పుస్తకం చదివిన తర్వాత తీవ్రంగా దిగులు పడ్డాను. ఇజం పుస్తకంలో రాజు రవితేజ్ నవసమ సమాజ నిర్మాణానికి బోధించిన తత్త్వం ప్రాథమిక పాఠశాల స్థాయిలో వుండటమే నా దిగులుకు అసలు కారణం.
పవన్ కళ్యాణ్...నేనిక్కడ రాజు రవితేజ్ గురించే చెబుతున్నానని గుర్తుంచుకో! ఎందుకంటే ఈ ఇజం పుస్తకం రచయితగా అతని పేరునే నువ్వు ఇచ్చావు గనుక. ఇజం పుస్తకంపై నా అభిప్రాయాల్ని ప్రజా వేదికలో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే నేను ప్రతిక్షణం నీ గురించి నా అభిప్రాయాల్ని అటువంటి ప్రజా వేదికల ద్వారానే చేరవేస్తాను.
జన సేన పార్టీ ఆవిర్భావ సమయంలో నీ ఫోజులనుంచి, నీ హావభావాలనుంచి, నీ మాటల ఊటనుంచి నేను ఒక విషయాన్ని కచ్చితంగా చెప్పగలను. ఇజం గ్రంథంలో చర్చించి వదిలేసిన నకారాత్మక విషయాలకంటే నీకు సహజాతంగా వచ్చిన జ్ఞానమే ఎక్కువ. అటువంటి ఉధ్గ్రంథాన్ని నాజీవితంలో నేనెప్పుడూ చదవలేదు. క్షమించు పవన్. రాజు రవి తేజ్ తో చెప్పించిన పాత చింతకాయ తత్త్వసిద్ధాంతాలు నీకు నిజంగా అవసరం లేదు.
ఆర్థర్ స్కాపెన్ హార్స్ పుస్తకం 'ద వరల్డ్ యాజ్ విల్ అండ్ ఐడియా'ను గానీ, ఇమ్మానుయేల్ కాంట్ పుస్తకం 'ద క్రిటిక్ ఆఫ్ రీజన్' గానీ ఒకసారి చదువు. తీరికలేని పనిఒత్తిడితో నీకు ఖాళీ దొరకదని నేను నమ్ముతున్నాను. ఆ విషయం నాకు తెలుసు. రాజు రవి తేజ ఈ పుస్తకాల్ని చదివి తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ పిల్లాడు నీ సహజాతమైన మేథో సంపత్తిని పాడు చేస్తున్నాడు. స్కాపెన్ హార్ ఆధిభౌతిక తత్త్వానికి, కాంట్ వేదాంతానికి, మార్క్స్ గతి తార్కిక భౌతిక వాదానికి రాజు రవితేజ్ వక్ర భాష్యం చెబుతున్నాడు. ఈ కుర్రాడు మిమ్మల్ని పూర్తి గా తప్పుదారి పట్టిస్తున్నాడు. నీ అసలుసిసలు ఆలోచనా విధానాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. అస్తిత్వ నిహిలిజాన్ని రాజు రవి తేజ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు.
గతంలో వెలువడిన త్వత్తసిద్ధాంతాలు, ఆధునిక సమాజాల ఏర్పాటును మీరు కచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆ ఆధునిక సమాజానికి వందశాతం నిష్కల్మషమైన పవనిజం కావాలి. అంతేగానీ అకస్మాత్తుగా ఏదో తోచింది చేసినట్లు , తప్పుడు రాతలు, వక్రభాష్యాలు, స్వయంగా కాకుండా రెండో వ్యక్తి ద్వారా తెలుసుకునే సూడో తత్త్వాలు కాదు కావాల్సింది. సత్యాన్ని చదవడానికి ఫిలాసఫీ చక్కటి వేదిక. ఈ మార్పుల్లేని సమాజంలో సత్యం సత్యం చేతనే అజరామరమవుంతుంది. అందుకే 'సత్యాన్ని చదవడం సాధారణం కానీ ఇది అంత ముఖ్యంకాదు, నీ అంతిమ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయపడే ప్రత్యేకమైన సత్యాన్ని చదవడం చాలా ముఖ్యమని అయాన్ ర్యాండ్ చెబుతుంది.
పవన్ ! నీ ముక్కుసూటితనాన్ని, నీ పార్టీ ఆవిర్భావ ఉపన్యాసాన్ని నీ పుస్తకంతో తులనాత్మకం చేసినపుడు నాకు ఒకటనిపించింది. 90 శాతం వరకూ నీ ఇజం పుస్తకం ఒక దిశానిర్దేశం లేకుండా సాగింది. నీ రెండవ ఉపన్యాసంలో కూడా అది లోపించింది. నీ మొదటి ప్రసంగం కంటే విశాఖపట్నంలో చేసిన ప్రసంగంలో రాజు రవితేజ్ నిన్ను బాగా ప్రభావితం చేసుండొచ్చు. మార్షల్ ఆర్ట్స్ చేసే ఫైటర్ బ్రూస్ లీ కూడా మంచి తత్వవేత్త. 'జ్ఞానమనేది నిచ్చెనకున్న మెట్లలాగా ఎక్కేందుకు మనకు ఉపయోగపడాలి. ఒకసారి ఎక్కిన తర్వాత ఒక్కో మెట్టును నీ వెనుక వదిలేయాలి. కానీ, నీవు ఆ మెట్లను సేకరించుకుంటూ పోతే చివరకు నీవెక్కిన నిచ్చెన బరువెక్కి ఏదో ఒకరోజు పడిపోవచ్చు. కాబట్టి నువ్వు మోయాలనుకుంటున్న బరువుని ఎప్పుడూ కూడా మోసుకెళ్లకు' అని ఒకచోట బ్రూస్ లీ అంటాడు.
పవన్, నేనిక్కడ బ్రూస్ లీ ని పేర్కోవడానికి కారణం అతని ఉద్వేగాన్ని, చొరవచూపించే సచ్ఛీలత నీకు పంచాలనుకుంటున్నాను. బ్రూస్ లీ శైలి లో ఉన్న గొప్పతనం ఇతరుల చేత ప్రభావితమవడాన్ని అతను నిరాకరించడం. నీగురించి నీవు ఏమనుకుంటున్నావో, నీ తత్త్వాన్ని నీకు నీవుగా ఎలా వ్యక్తపరచాలో అర్థంచేసుకుంటావని ఆశిస్తున్నాను. నీమీద ఉన్న ఇతరత్రా దుష్ప్రభావాలను వదిలించుకుంటావని నీ శ్రేయోభిలాషిగా వేడుకుంటున్నాను. చివరిగా నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. నీ ఇజం గ్రంథంతో పూర్తిగా నిరాశ చెందాను. కానీ, పవనిజం మీద మాత్రం ఇప్పటికీ అమితమైన అంచంచల విశ్వాసంతో ఉన్నాను.
ధన్యవాదాలు
సదా నీ శ్రేయస్సును కాంక్షించే
రాం గోపాల్ వర్మ